Saturday, April 11, 2026

Buy now

మద్యం మాఫియాపై ప్రజా యుద్ధం

మద్యం మాఫియాపై ప్రజా యుద్ధం

40 మంది మహిళల సంచలన ఫిర్యాదు

గ్రామంలో ఉప్పెనలా ప్రజా ఆగ్రహం

హసన్‌పర్తి, ఏప్రిల్ 11 అక్షర సవాల్ ప్రతినిధి: జయగిరి గ్రామంలో బెల్ట్ షాపుల రూపంలో విస్తరించిన అక్రమ మద్యం మాఫియాపై ప్రజా ఆగ్రహం ఉప్పెనలా ఎగిసిపడింది. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తూ, యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతున్న ఈ అక్రమ దందాపై 40 మంది మహిళలు ఏకమై గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్‌కు సంచలన ఫిర్యాదు చేయడంతో గ్రామంలో సామాజిక ఉద్యమానికి నాంది పలికింది. ఈ ఘటన ఒక్క గ్రామానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపుల వెనుక ఉన్న మద్యం మాఫియా, అధికార యంత్రాంగం పర్యవేక్షణ వైఫల్యం, పైస్థాయి మౌనం వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారితీసింది. గ్రామంలోని అనేక కుటుంబాలు మద్యం బారిన పడి ఆర్థికంగా కుదేలవుతుండగా, యువత వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల విద్యపై ప్రభావం, కుటుంబాల్లో పెరుగుతున్న గొడవలు, మహిళలపై మానసిక వేధింపులు, వృద్ధుల మనశ్శాంతి కోల్పోవడం వంటి సమస్యలు జయగిరిని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయని గ్రామస్థులు చెబుతున్నారు. “ఇల్లు నిలవాలంటే ముందుగా బెల్ట్ షాపులు పోవాలి” అన్న మహిళల నినాదం ఇప్పుడు గ్రామంలో ఉద్యమ స్వరంగా మారింది. ఈ తరుణంలో సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ తీసుకున్న నిర్ణయం గ్రామంలో ఆశలు రేపుతోంది. ఈ పోరాటంలో కేసులు వచ్చినా, ఒత్తిడులు వచ్చినా వెనక్కి తగ్గను. మన గ్రామంలో ఒక్క కుటుంబాన్ని అయినా మద్యం బారి నుంచి కాపాడగలిగితే అదే నా విజయంగా భావిస్తా” అని ఆయన చేసిన భావోద్వేగ ప్రకటన ప్రజల్లో విశేష స్పందన రేకెత్తిస్తోంది. గ్రామసభలో ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరిపి, బెల్ట్ షాపుల నిర్మూలనకు తీర్మానం చేయడం, పోలీసు–ఎక్సైజ్ శాఖలతో సంయుక్త దాడులు నిర్వహించడం, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, మహిళా సంఘాలతో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలను మరింత కలవరపెడుతున్న అంశం అధికారుల నిర్లక్ష్యం. ఇంత బహిరంగంగా అక్రమ మద్యం అమ్మకాలు సాగుతున్నా స్థానిక ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖలు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మహిళలు ఫిర్యాదు చేసే వరకు చర్యలు లేకపోవడం, క్షేత్రస్థాయి వైఫల్యం, పై అధికారుల పర్యవేక్షణ లోపం అన్నీ ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి.“చూసీ చూడనట్టుగా వ్యవహరించారా? లేక మాఫియాతో కుమ్మక్కయ్యారా?” అన్న ప్రశ్నలు గ్రామం నుంచి జిల్లా స్థాయికి చేరుతున్నాయి. జయగిరిలో ప్రారంభమైన ఈ ప్రజా ఉద్యమం ఇతర గ్రామాలకు కూడా ప్రేరణగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలే ముందుండి నడిపిస్తున్న ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపుల మద్యం మాఫియాపై పెద్ద చర్చకు దారితీస్తూ, గ్రామస్థాయి ప్రజా ఉద్యమానికి కొత్త దిశ చూపుతోంది.

Related Articles

Latest Articles