గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికావు
* జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ నరేందర్
మంగపేట, జనవరి 29 ( అక్షర సవాల్ ) ప్రజా యుద్ధ నౌకగా పేరుగాంచిన ప్రజా గాయకుడు గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికావని జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ మురుకుట్ల నరేందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మురుకుట్ల నరేందర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో కలం పట్టి గళం విప్పి పోరు సలిపిన గద్దర్ ప్రజా సేవకుడు అని అన్నారు. కేవలం వ్యక్తిగత కక్ష, అక్కసుతోనే బండి సంజయ్, బిజెపి పార్టీ ఒక కళాకారునికి దక్కవలసిన గౌరవాన్ని దక్కకుండా చేస్తున్నారని మురుకుట్ల నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో యావత్ తెలంగాణ స్థితి గతులను, బాధలను బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసిన గద్దర్ ది ఒక చరిత్ర అని అన్నారు. బండి సంజయ్ బిజెపి పార్టీ ముసుగులో గద్దర్ ను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గద్దర్ పై బండి సంజయ్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో అన్ని కులాలను, అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రం అంతా కాలినడకన నడిచిన గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వడంలో తప్పేముందని ప్రభుత్వం కూడా అవార్డును ప్రకటించి గద్దర్ త్యాగాలకు తగిన గుర్తింపును ఇవ్వాలని నరేందర్ కోరారు.