ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా : గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్
భూపాలపల్లి, నవంబర్ 1(అక్షర సవాల్):
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించి, ఎన్నికలను అవాంతరాలు లేకుండా, ప్రశాంతంగా నిర్వహించాలని గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్ ఐపీఎస్ పేర్కొన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కేటిపిపి గెస్ట్ హౌజ్ లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎస్పీలు, కిరణ్ ఖరే, గౌస్ ఆలం తో పాటు ఇరు జిల్లాల మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ములుగు జిల్లాలో నెలకొన్న పరిస్థితి గురుంచి ఎస్పీలు కిరణ్ ఖరే, గౌస్ ఆలం అదనపు డీజీ, ఐజీలకు వివరించారు. అనంతరం అదనపు డిజీ విజయ్ కుమార్ మాట్లాడుతూ మావోయిస్టులపై నిరంతరం నిఘా పెట్టి, సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమాచార మార్పిడి చేసుకోవాలని అన్నారు, తద్వారా మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా కట్టడి చేయవచ్చని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా చేయవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాలని, పోలీసులతో నిరంతర తనిఖీ చేపట్టలన్నారు. అలాగే మావోయిస్ట్ టార్గెట్లకు రక్షణ కల్పించాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. నామినేషన్ నుంచి మొదలు పోలింగ్ అయ్యేవరకు ఎక్కడ ఏలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా విధులు ఉండాలని,కేంద్ర పాలమెంటరీ దళాలను ఉపయోగించి పటిష్ట భద్రత చేపట్టాలని అదనపు డిజి అన్నారు. ఎస్ఐబి ఐజి ప్రభాకర్ రావు మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎస్పీలు కిరణ్ ఖరే ఐపీఎస్, గౌస్ అలం ఐపీఎస్, ములుగు, భూపాలపల్లి ఓఎస్డీ అశోక్ కుమార్ ఐపీఎస్, ఏఎస్పి ఏటూరునాగారం సంకీర్త్ ఐపీఎస్, ఎస్ఐబి ఓఎస్డీ దయానంద్ రెడ్డి, డీఎస్పీలు, రాములు, రామ్ మోహన్ రెడ్డి, రవీందర్, సంపత్ రావు, మరియు ఇరు జిల్లాల పోలిసు అధికారులు పాల్గొన్నారు.