ప్రతి ఫిర్యాదు పై స్పందించాలి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్.
భూపాలపల్లి, అక్టోబర్ 11(అక్షర సవాల్) :
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదు పై వెంటనే స్పందించి, విచారణ జరిపి , బాధితులకు పూర్తి భరోసా, ధైర్యాన్నిచ్చేలా పనిచేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు. బుధవారం టేకుమట్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పి, స్టేషన్ లోని పలు రికార్డులను రిసెప్షన్, వివిధ విభాగాలను పరిశీలించి, అక్కడ పోలీసు సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఎస్పి కరుణాకర్ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది, అధికారులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ఎవరికి కేటాయించిన విధుల్లో వారు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలోని ప్రతి గ్రామం పట్ల పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, దొంగతనాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్నికల దృష్ట్యా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని, సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. గంజాయి, మద్యం, నగదు అక్రమ రవాణాను నిరోధించాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కరుణాకర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, చిట్యాల సిఐ వేణు చందర్, టేకుమట్ల ఎస్సై సుధాకర్, సిసి ప్రదీప్ పాల్గొన్నారు.