అత్తింటి వారి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య?
రంగారెడ్డి,జూలై 6 (అక్షర సవాల్ ):
ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుకు పెట్టిన ఆ యువతికి ఆ ఆశలు అడియాశలుగా మారాయి. జీవితాంతం తోడుగా ఉంటానన్న భర్తే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్న బిడ్డగా చూసుకుంటారని భావించిన అత్తామామలు సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేశారు. భర్త, అత్తింటి వారి వేధింపులతో అలిసిపోయిన నవవధువు జీవితంపై విరక్తి చెంది తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. మైలార్‌దేవ్‌పల్లిలో గురువారం నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక కవిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌తో కవితకు వివాహం జరిగింది. వివాహం అయిన కొన్ని రోజులకే కంత్రీగాడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటిపోటి మాటలతో కవితను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. భర్త కుటుంబం వేధింపులు భరించలేక కవిత తనువు చాలించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కవిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కవిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై 304 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లై అత్తారింట్లో సుఖసంతోషాలతో ఉంటుందనుకున్న తమ బిడ్డ ఇలా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.