– జాతీయ రహదారిపై గుంతలో పడి వ్యక్తి మృతి
– మృతదేహంతో గ్రామస్తుల ధర్నా
మరిపెడ,జులై17(అక్షర సవాల్): అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద సంఘటన మరిపెడ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని వీరారం గ్రామానికి చెందిన తాళ్ళపల్లి శ్రీనివాస్(45) మంగళవారం రాత్రి తన కుమారుడుతో కలసి ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామానికి వెళుతుండగా,పట్టణ కేంద్రంలోని ఖమ్మం – వరంగల్ ప్రధాన జాతీయరహదారిపై గల గుంతలో పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.అతని కుమారుడు రాకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి.కాగా, జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు,ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంతోనే శ్రీనివాస్ మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని సంబంధీకులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న మరిపెడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి,పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.