భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా అదనపు ఎస్పీ
భూపాలపల్లి, సెప్టెంబర్ 1(అక్షర సవాల్):
జిల్లాలో భారీ వర్షాలతో చెరువులు,వాగులలో ప్రవాహం ఎక్కువగా వున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, అవసరం ఐతే తప్ప బయటకి రావద్దని, రైతులు పొలాల దగ్గరకి వెళ్ళినప్పుడు కరంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా వుండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్ అన్నారు . ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో చిట్యాల మండలం నైన్ పాక, భూపాలపల్లి మండలం మొరంచపల్లిలో భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు, సిఐ మల్లేశ్ లతో కలిసి మొరంచవాగు వరదను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తునందున విద్యుత్తు స్తంభాలు, వైర్లకు తాకకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు. గోదావరి, మానేరు నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, మత్స్యకారులు, ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, వరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు నది దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. విపత్కర పరిస్థితిలో ప్రజలకు సేవలందించడానికి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా డైల్ 100కి లేదా స్థానిక పోలీస్ అధికారులకి ఫోన్ చేయాలని అదనపు ఎస్పీ సూచించారు.