పోలిసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎస్పి కిరణ్ ఖరే, కలెక్టర్ భవేశ్ మిశ్రా
-పోలిసు అమరవీరులకు ఘనంగా నివాళులు
భూపాలపల్లి ,అక్టోబర్ 21 (అక్షర సవాల్):
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (పోలీస్ ప్లాగ్ డే) భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్మారక స్థూపానికి ఎస్పి, కలెక్టర్ భవేశ్ మిశ్రా ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ… పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ భద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులదేనన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు.
ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు. 1959 ఇండో-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారన్నారు. అలాగే 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారని తెలిపారు.
కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ….. పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కరోనా సమయంలో పోలీసుల సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు.
అనంతరం ఈ సంవత్సరం అమరులైన 189 పేర్లను/ రోల్ ఆఫ్ హానర్ ను ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ చదివి వినిపించారు. అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించిన ఎస్పి కలెక్టర్ , పోలిసు అమరవీరుల కుటుంబ సభ్యులకు గృహోపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, జిల్లా పరిధిలోని సీఐలు, ఆర్ఐ లు, ఎస్సై లు, పోలిసు అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.