మెడికల్ ఎమెర్జెన్సీ నిమిత్తం మాత్రమే బయటకు రావాలి
భూపాలపల్లి, జూలై 27(అక్షర సవాల్):
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా జిల్లాలోని వాగులు,వంకలు,చెరువులు మరియు గోదావరి నది, మానేరు నది ఉదృతంగా ప్రవహిస్తున్నాయని, జిల్లాలోని చాలా ప్రాంతాలలో రహదారులపై,లో లెవెల్ బ్రిడ్జి లపై వరద నీరు ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారాయని .కావున ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా జిల్లా అధికారుల సూచనలను పాటించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ అన్నారు. భారీ వర్షాలతో పరకాల – భూపాలపల్లి జాతీయ రహదారి పై మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ, మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో కలిసి, పరిస్థితిని సమీక్షించి, జలమయమయిన ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలింపుతో పాటు, సహాయ చర్యల్లో ఎస్పి పుల్లా కరుణాకర్ పాల్గొన్నారు.
ఎగువన నుండి నీటి ఉధృతిని ప్రమాద స్దాయిలో ప్రవహిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా మోరంచ వాగు వంతెనపై రాకపోకలను నిషేధించిన ఎస్పి , బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఏలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకున్నారు. మోరంచ పల్లి గ్రామంలో వరదల్లో చిక్కుకున్న వారిని, చిట్యాల మండలం నైన్ పాక లో మరో ఆరు గురిని హెలికాప్టర్ ద్వారా, రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడారు. అలాగే కొయ్యూరు పియస్ పరిధిలో మానెరు నదిలో చికుకున్న ఇద్దరినీ ఎస్ఐ నరేష్ కాపాడారు. కాటారం మండలం గంగారంలో నదిలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను కలెక్టర్ భవేశ్ మిశ్రా చొరవతో స్థానిక కాటారం పోలీసులు కాపాడారు. ఈ సందర్బంగామెడికల్ ఎమర్జెన్సీ కొరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని జిల్లా ప్రజలకు ఎస్పి విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్న వారికి సేవలందిoచాలని, వరదల దృష్ట్యా పోలీసు అధికారులు, సిబ్బందికి సెలవులు ఎస్పి రద్దు చేశారు.
వరద ఉధృతంగా ఉన్న ప్రాంతాలలో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎస్పి కరుణాకర్ వెల్లడించారు.వరద ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో వాగులు, చెరువులు దాటవద్దని అన్నారు. మత్సకారులు, రైతులు పశువుల కాపర్లు, జాగ్రత్తలు పాటించాలని, వరద భారీగా ఉన్న ప్రాంతాల్లో వాగులు దాటే సాహసం చేయవద్దని తెలిపారు. జిల్లా పోలీస్ యాంత్రంగం అప్రమత్తంగా ఉందని, ప్రజలకు ఏ సమయం లోనైనా సహాయం కోసం సంప్రదించాలని సూచించారు.
అత్యవరసర సమయాల్లో మాత్రమే బయటకి రావాలని ప్రజలకు సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత సెల్ఫీ లు తీసుకోవడానికి మత్తడి పోస్తున్న చెరువులు, పారుతున్న కాలువల వద్దకు వెళ్లవద్దని ఎస్పి కరుణాకర్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలియచేసారు.