కేబినెట్ విస్తరణ వార్తల వేళ.. జులై 3న మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ..
(అక్షర సవాల్ డెస్క్ ) జూన్ 29:
దిల్లీ: త్వరలో కేంద్ర మంత్రివర్గం (Union Council of Ministers)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections 2023) నేపథ్యంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే జులై 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి భేటీ జరగనుండటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
వచ్చే సోమవారం (జులై 3న) ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి మండలితో సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. బుధవారం అర్ధరాత్రి ప్రధాని మోదీ తన నివాసంలో భాజపా (BJP) సీనియర్ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
లోక్‌సభ ఎన్నికలకు అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటు మంత్రిమండలిలో మార్పులు గురించి కూడా ఇందులో చర్చించినట్లు సమాచారం. దీంతో త్వరలోనే కేబినెట్‌లో భారీ మార్పులు జరగనున్నట్లు వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులతో ప్రధాని సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతమున్న మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికి.. కొత్తవారికి చోటు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది..