తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ పరిస్థితి ఏంటి..?
హైదరాబాద్ :జులై 04 ( అక్షర సవాల్ ) :
ఎన్నికల ముందు బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా పాఠకులు అనుకున్నట్లుగా తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పుకు సంబంధించిన ప్రత్యేక కథనాలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అగ్రనాయకత్వం నియమించింది. రెండు మూడ్రోజుల్లో అధ్యక్ష పదవీ బాధ్యతలను కిషన్ రెడ్డి స్వీకరించనున్నారు. ఇక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ ఛైర్మన్‌గా కేంద్రం నియమించింది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎవరూ ఊహించని వ్యక్తిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. సీనియర్ నేత, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజు స్థానంలో సత్యకుమార్, సుజనా చౌదరిని కూడా పరిశీలించిన అధిష్టానం ఆఖరి నిమిషంలో.. పురంధేశ్వరిని నియమించడం పెద్ద ట్విస్టే అని చెప్పుకోవచ్చు. అధ్యక్ష పదవుల మార్పులకు సంబంధించి, ఇతర నేతల పదవులకు సంబంధించి అన్నీ అధికారిక ప్రకటనలు వచ్చేశాయి.
బండి పరిస్థితి ఇదీ!!
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. బండిని మార్చొద్దని.. ఆయన్ను మారిస్తే రాష్ట్రంలో బీజేపీకి పరిస్థితులు అనుకూలించవని పదే పదే నివేదికలు, ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్లాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా ఈ మార్పును తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలోనే తనకు ఎలాంటి పదవి అక్కర్లేదని.. సామాన్య కార్యకర్తగానే పార్టీకోసం పనిచేస్తానని కూడా బండి తన అత్యంత సన్నిహితుల వద్ద భావోద్వేగానికి లోనైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడి ఎంపికలో మల్లగుల్లాలు పడిన అధిష్టానం ఆఖరికి మార్పులు, చేర్పులు చేసేసింది. అయితే బండిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవిని స్వీకరించడానికి బండి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికి చూస్తే.. తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, పంజాబ్‌కు కూడా అధ్యక్షులను అధిష్టానం మార్చింది. ఈ మార్పులు, చేర్పులు రానున్న ఎన్నికల్లో ఏ మాత్రం బీజేపీకి లాభం చేకూరుస్తాయో వేచి చూడాలి మరి….