ఏజెన్సీలో హై టెన్షన్…. హైఅలర్ట్…
– రేపటి నుండి మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు
– అప్రమత్తమైన పోలీసులు
– అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్
– గొత్తి కోయగూడెంలలో నిత్యం సోదాలు
– రహదారులపై నిత్యం వాహనాల తనిఖీలు
– ఆందోళనలో ఏజెన్సీ ప్రజానీకం
మంగపేట, జూలై 27 అక్షర సవాల్ : మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు రేపటి ( ఆదివారం) నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అటవీ గ్రామాలలో ఆందోళనకర వాతావరణం నెలకొని ఉంది. మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకులు చార్ మజుందార్ 1972 జూలై 28న ఎన్ కౌంటర్ లో మృతి చెందగా ఆ తర్వాత సంవత్సరం నుండి ప్రతి ఏటా జూలై 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మావోయిస్టులు అమరులైన వారిని స్మరించుకుంటూ, నివాళులర్పిస్తూ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల విజయవంతం చేయాలంటూ మావోయిస్టులు ఇప్పటికే కరపత్రాల ద్వారా పిలుపునిచ్చారు. మావోయిస్టు వారోత్సవాలు నేపధ్యంలో ఏజెన్సీలోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు.
- అప్రమత్తమైన పోలీసులు …..
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపధ్యంలో ఏటురునాగారం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, పేరూరు, వెంకటాపురం(నూగూరు) పోలీస్ స్టేషన్ల పరిధిలోని అటవీ గ్రామాలలో గత కొన్ని రోజులుగా సీఆర్ఫీయఫ్, గ్రేహేండ్స్ బలగాలతో పోలీసులు అనునిత్యం అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గొత్తికోయ గూడెలలో సోదాలు ( కార్దన్ సెర్చ్ ) చేస్తున్నారు. కొత్త వ్యక్తులు, అనుమానితులు సంచరిస్తున్నారా అని అక్కడి వారిని అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానితులకు, పరిచయం లేని వారికి ఆశ్రయం ఇవ్వవద్దని, నక్సలైట్లకు సహకరించవద్దని, లేనిపోని చిక్కులు కొని తెచ్చుకోవద్దని అక్కడి వారిని హెచ్చరిస్తున్నారు. ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో రహదారులపై నిత్యం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
- టార్గెట్లను అప్రమత్తం చేసిన పోలీసులు ………
అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో గ్రామాలలోని, మండల కేంద్రాలలోని ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను పోలీసులు అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది. గత పది రోజుల నుండి తెలంగాణా చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలోని సరిహద్దు మండలాలలో మావోల కదలికలు బయటపడ్డాయి. జూలై 20 న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా ఎల్మిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీమల దొడ్డి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరవసారి గుట్ట సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్ట్,. జూలై 25 న ములుగు జిల్లా తాడ్వాయి మండలం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సరిహద్దు ప్రాంతమైన దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నల్లమారి అశోక్ అలియాస్ విజెందర్ అనే మావోయిస్టు మృతి చెందాడు. దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంఎల్ఏ లు పూర్తి భాద్యత వహించాలంటూ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు తమ ఉనికి చాటేందుకు ఏదైనా దుశ్చర్యకు పాల్పడే అవకాశాలు ఉండడంతో వారోత్సవాలు ముగిసే వరకు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని టార్గెట్ లకు, రాజకీయ నాయకులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు తెలియకుండా అటవీ గ్రామాలలో పర్యటనలకు వెళ్లవద్దని, సాధ్యమైనంతవరకు వారోత్సవాలు ముగిసే వరకు అటవీ ప్రాంతాలలో పర్యటనలను రద్దు చేసుకోవాలని రాజకీయ నాయకులకు ఏజెన్సీలోని పోలీసులు సూచించినట్లు సమాచారం.
- ఆందోళనలో ప్రజానీకం…
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల విజయవంతం చేయాలని ఒక ప్రక్క మావోయిస్టులు పిలుపునివ్వడం, మరోపక్క పోలీసులు నిత్యం అడవి గ్రామాల్లో సోదాలు, తనిఖీలు నిర్వహించడంతో ఏటూరునాగారం సబ్ డివిజన్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో ఎప్పుడేం జరుగుతుందోనని ఏజన్సీ ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు.