జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
త్వరలో జర్నలిస్టుల ఇంటి స్థలాలపై సీఎం ప్రకటన
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, మే 17 అక్షర సవాల్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టులు నిజనిర్ధారణతో కూడిన వార్తలనే ప్రజలకు అందించాలని సూచించారు. హనుమకొండలోని జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆదర్శ లా కాలేజీలో నిర్వహించిన రాష్ట్ర ప్రథమ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. వార్తలు రాసే ముందు జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు. సమాచార లోపంతో లేదా హైలెట్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు, అధికారులపై అసత్య కథనాలు ప్రచురించడం వల్ల వారి వ్యక్తిత్వం దెబ్బతినడంతో పాటు మనోభావాలు కూడా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశంపై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈ విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశముందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తానని, హనుమకొండ జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందని తెలిపారు. నిజమైన జర్నలిస్టుకు అక్రిడేషన్ కంటే సంస్థ జారీ చేసే గుర్తింపు కార్డు చాలని పేర్కొన్నారు. సంఘాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర, జిల్లా నాయకత్వం సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుగంటి రాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నూటంకి ప్రభాకర్, రాష్ట్ర మహిళా కార్యదర్శి చాగంటి మంజుల, రాష్ట్ర కార్యదర్శి సూరపాక రాజు, లీగల్ అడ్వైజర్ రాచకొండ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి ఆదిల్, పోశాల బిక్షపతి గౌడ్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

