మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
– జిల్లా కలెక్టర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం, ఆగస్టు 2(అక్షర సవాల్):
శనివారం భూపాలపల్లి నియోజకవర్గ పర్యటనకు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ కడియం కావ్య, టిజిఐఐసి రాష్ట్ర చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తదితర ముఖ్య నేతలు హాజరవుతున్నారని, ఇట్టి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మైలారం గుట్ట తో పాటు 100 పడకల ఆసుపత్రి, హెలీ ప్యాడ్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపురం మండలంలోని మైలారం శివారు గుట్టలల్లో సుమారు 60 ఎకరాలల్లో రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి నిర్మాణ పనులకు రాష్ట్ర సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ , పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం భూపాలపల్లిలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన డ్రగ్స్ స్టోరేజ్ రూము మరియు డాక్టర్స్ క్యాంటీన్ ను మంత్రులచే ప్రారంభించి, హెల్త్ రివ్యూలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని ఐడివోసి మీటింగ్ హాల్ లో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఉంటుందని తెలిపారు. కావున, ఇట్టి మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.