పిఆర్సి వెంటనే ప్రకటించాలి
ఉద్యోగ సంఘాల అల్టిమేటం
గీసుకొండ, అక్షర సవాల్: ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం బహిర్గతమైంది. గీసుకొండ తహసీల్దార్ కార్యాలయం శుక్రవారం నాడు నిరసనలతో దద్దరిల్లింది. పిఆర్సి ప్రకటనలో జాప్యం, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం వంటి సమస్యలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏకమై గట్టిగా గళమెత్తారు. టీజీఈజేఏసీ పిలుపుతో జరిగిన ఈ ముట్టడి కార్యక్రమంలో సుమారు వందమంది ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యాలయం ఎదుట నినాదాలతో ఆందోళన చేపట్టిన వారు, అనంతరం ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించిన ఉద్యోగ సంఘాలు, తమ హక్కులను ఇకపై వాయిదా వేయలేమని స్పష్టం చేశాయి.“ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది” అని హెచ్చరించాయి.
ఉద్యోగ సంఘాల కీలక డిమాండ్లు
పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్అమలు చేయాలి
పిఆర్సి తక్షణమే ప్రకటించాలి
డిఎస్సి-2003 అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
పెండింగ్ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలి
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. రవీందర్, పిఆర్టియు గీసుకొండ అధ్యక్షుడు కల్లూరి వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ మార్థ శ్రీనివాస్, యుటిఎఫ్ నాయకులు మల్సూర్, రాహుల్, డీటీఎఫ్ నాయకులు రమేష్, రజనీకాంత్, ఆర్యుపిపి జిల్లా అధ్యక్షుడు కుమార్, మండల అధ్యక్షుడు సాగర్, పీజీఎచ్ఎం సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


