పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న కవిత
తెలంగాణ జాగృతి పార్టీలో ప్రముఖుల చేరికలు
బోథ్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపూరావు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, అక్షర సవాల్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు బోథ్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపూరావు గారికి కండువా కప్పి జాగృతిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ అనేక జిల్లాల నుంచి కొత్త పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2006లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తమ కుటుంబంతో వారం రోజులు ఉండి వైద్య శిబిరం పెట్టామని గుర్తుచేశారు. రాథోడ్ బాపూరావు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ ఉద్యమంలో పని చేశారని, రెండు సార్లు శాసనసభ్యులు అయ్యారని పేర్కొన్నారు. జాగృతి ద్వారానే రాథోడ్ బాపూరావు భారత రాష్ట్ర సమితిలో చేరారని తెలిపారు. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు కొత్త పార్టీ వైపు చూస్తున్నారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పార్టీకి ఆదరణ ఉంటుందని అన్నారు. ఉద్యమకారులు ఒక్కటి కావాలని, ఏ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రావాలని కోరారు. ఇదే వేదిక మీద సిరిసిల్ల నియోజకవర్గం నుంచి జాగృతిలో చేరుతున్న వారికి స్వాగతం పలుకుతున్నానని అన్నారు.బోథ్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి రోజులు వస్తాయని ఉద్యోగానికి రాజీనామా చేసి బోథ్ నియోజకవర్గంలో పని చేశానని తెలిపారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కవిత వారం రోజుల పాటు వైద్య శిబిరం పెట్టారని, కవిత గారు ఇచ్చిన ధైర్యంతోనే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రెండు సార్లు శాసనసభ్యునిగా గెలిచానని, మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారని, మూడవ సారి తనకు అవకాశం ఇవ్వలేదని వెల్లడించారు. కవిత నాయకత్వంలో కొత్త పార్టీలో చేరబోతున్నానని, తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా కవిత కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా తనకు ప్రాధాన్యత దక్కలేదని తెలిపారు. కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత ఇచ్చోడలో పెద్ద సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తానని ప్రకటించారు.

