అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం : జిల్లా ఎస్పీ
-గంజాయిపై ప్రత్యేక దృష్టి, నివారణకు పటిష్ఠ చర్యలు.
-సైబర్ నేరాల నియంత్రణకు కోసం కృషి.
-2023 వార్షిక నేర నివేదిక సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి, డిసెంబర్ 30(అక్షర సవాల్):
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గత సంవత్సరంతో పోలిస్తే 14.52 శాతం నేరాల శాతం పెరిగాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 2023 వార్షిక నివేదిక సమావేశంలో అదనపు ఎస్పీలు నరేష్ కుమార్, శ్రీనివాస్ తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే అసాంఘిక శక్తులపై ఉక్కు పాదం మోపుతామని ముఖ్యంగా గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పుకొచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు. ప్రజలు అందరూ సైబర్ నేరముల పట్ల అప్రమత్తముగా వ్యవహరించాలని, ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్పీ అన్నారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రోడ్లపై నిర్లక్ష్యంగా అధిక వేగంతో, పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాన్ని నడుపుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించరాదని, 31 సాయంత్రం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, గడిచిన సంవత్సరం నుంచి కొత్త పాఠాలు నేర్చుకుని, కొత్త ఆశలతో నూతన సంవత్సరం 2024లోకి అడుగుపెట్టాలని వివాదాలకు తావు లేకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు.