Trending Now
Wednesday, April 16, 2025

Buy now

Trending Now

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు

*రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు

  • భూపాలపల్లి జిల్లాలో గోరికొత్తపల్లి
  • రంగారెడ్డిజిల్లాలో మరో మండలానికి ప్రతిపాదన

భూపాలపల్లి : జూన్‌ 29(అక్షర సవాల్):

రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటు కానున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గోరికొత్తపల్లి, రంగారెడ్డి జిల్లాలో ఇర్విన్‌ మండలాల ఏర్పాటుకు రెవెన్యూశాఖ ప్రతిపాదించింది. గోరికొత్తపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ బుధవారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ మండలం ఏర్పాటుకు గత జనవరిలో ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించి.. వాటిని పరిశీలించి తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు, 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త మండలం ఏర్పాటుతో మండలాల సంఖ్య 12కు చేరనున్నది. భూపాలపల్లి జిల్లాలో 2016 అక్టోబరు 11న కొత్తగా టేకుమట్ల, పలిమెల మండలాలను ఏర్పాటు చేయగా తాజాగా గోరికొత్తపల్లిని ఏర్పాటు చేశారు.

రంగారెడ్డి జిల్లాలో ఇర్విన్‌ మండలం ఏర్పాటుకు రెవెన్యూశాఖ ప్రతిపాదించింది. మాడ్గుల్‌ మండలం నుంచి తొమ్మిది గ్రామాలతో ఇర్విన్‌ మండలం ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ రెవెన్యూశాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏవైనా అభ్యంతరాలు, వినతులు ఉంటే పది రోజుల్లో సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలున్నాయి. ఇర్విన్‌ మండలం ఏర్పాటుతో ఆ సంఖ్య 28కి చేరనున్నది.

అలాగే హన్మకొండ జిల్లాలోని రెండు గ్రామాల బదలాయింపునకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. హన్మకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి బదిలీ చేసింది. అలాగే వేలేరు మండలం ఎర్రబల్లె గ్రామాన్ని అదే జిల్లాలోని భీమదేవరపల్లి మండలానికి బదలాయించింది. అభ్యంతరాలు, వినతులకు పక్షం రోజుల గడువు ఇస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గిద్దెముత్తారం, కల్వపల్లి గ్రామాలు, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం శాంతరాజ్‌పల్లి గ్రామాలను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలానికి బదిలీ చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Related Articles

Latest Articles