పరిస్థితి చెయ్యి దాటితే ..మీదే బాధ్యత.. డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్..!
హైదరాబాద్ , జులై 02(అక్షర సవాల్):
ఖమ్మం సభకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి సభకు బయలుదేరిన వాహనాలను అడ్డుకోవడంపై సీరియస్ అయ్యారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండి పడ్డారు.
ఈ అంశంపై డీజీపీతో ఫోన్లో మాట్లాడిన రేవంత్, మధుయాష్కీ గౌడ్.. సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని కోరారు. అడ్డుగోడలు దాటుకునైనా సభకు హాజరవుతామని స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటితే బాధ్యత మీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం సభకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన రేవంత్ రెడ్డి, మధుయాష్కిలు బయలుదేరారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఇవాళ వాహనాల తనిఖీలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు మండలం లలితపురం, టేకులపల్లి మండలంలో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. బూర్గంపాడు, భద్రాచలం వద్ద ఆర్టీవో అధికారులు, పోలసులు కలిసి చెకింగ్ చేస్తున్నారు. ఖమ్మం సభ దృష్ట్యానే పోలీసులు తనిఖీలు చేపట్టారని అశ్వారావుపేటలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు.