రైతన్నల ఆశలు ఆవిరేనా……!
- నాలుగు సొసైటీల రైతులకు వర్తించని రుణమాఫీ..
- సొసైటీలకు ఎస్బీఐ ద్వారా ఫైనాన్సింగ్ చేసుకోవడమే పాపం
- ఆందోళనలో 4065మంది రైతులు
- రూ.12.59కోట్లు రుణమాఫీపై సందిగ్ధత
- తమకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వానికి రైతుల వేడుకోలు
ములుగు జిల్లా ప్రతినిధి,(అక్షర సవాల్):
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ద్వారా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ వర్తింపజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పథకం ప్రారంభించారు. అయితే ములుగు జిల్లాలోని మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, భూపాలపల్లి జిల్లాలోని ఒక పీఏసీఎస్ పరిధిలోగల రైతులు రుణమాఫీకి నోచుకోవడంలేదు. ములుగు జిల్లాలో ఇతర పీఏసీఎస్ ల పరిధిలోని 12906మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తూ జిల్లా అధికార యంత్రాంగం జాబితా విడుదల చేసింది. అయితే ఆ నాలుగు సొసైటీలకు ఎస్బీఐ ఫైనాన్సింగ్ చేయడం, సదరు బ్యాంకు అధికారులు రుణపంపిణీ, రెనివల్ చేయకపోవడంతో 4065మంది రైతులు రూ.12.59కోట్లు నష్టపోతున్నారు. ఈవిషయంపై సొసైటీ చైర్మన్లు, సీఈవోలు కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపాలు చేశారు. - నాలుగు సొసైటీల రైతులకు రుణమాఫీ లేదు..
ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంతోపాటు వెంకటాపూర్ మండలం పాలంపేట, లక్ష్మీదేవిపేట పీఏసీఎస్, భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లకు ములుగులోని ఎస్బీఐ బ్యాంకు ద్వారా రుణసదుపాయం కల్పిస్తున్నారు. ఇంచర్ల పీఏసీఎస్ పరిధిలో 421, పాలంపేటలో 395మంది, లక్ష్మీదేవిపేటలో 295మంది, గణపురం పీఏసీఎస్ పరిధిలో 2954మంది మొత్తంగా 4065మంది రైతులు ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 నుంచి 09 డిసెంబర్ 2023 కటాఫ్ తేదీని నిర్ణయించేవరకు ఈ సొసైటీల పరిధిలోని రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో కమర్షియల్ బ్యాంక్ రుణసహాయం పొందే జాబితాలో (సీడెడ్ సొసైటీలు) ఈ నాలుగు సొసైటీలు ఉండటం వీరికి శాపంగా మారింది.
- ఎస్బీఐ ఫైనాన్షియల్ పరిధిలో ఉండడమే శాపమా..?
నాలుగు సొసైటీల పరిధిలోని 4065మంది రైతులకు 2018 డిసెంబర్ నుంచి రుణపంపిణీ చేయకపోవడం, రుణాలకు రెన్యువల్ చేయకపోయే సరికి ఈ పరిస్థితి ఏర్పడింది. ఆయా సొసైటీల చైర్మన్లు, సీఈవోలు బ్యాంకు అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని అధికారులకు విన్నవించారు. ఎన్సీఎల్ గురించి ఎస్బీఐ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఆయా పీఏసీఎస్ లలోని రైతుల ఆర్థిక అభివృద్థికి సహకరించలేదు. దీంతో ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీకి సొసైటీల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంచర్ల పరిధిలో రూ.కోటి 24లక్షలు, పాలంపేట పరిధిలో రూ.కోటి 35లక్షలు, లక్ష్మీదేవిపేట రూ.81లక్షలు, గణపురం రూ.9కోట్లు మొత్తంగా సుమారు రూ.12.59కోట్లకు పైగా రైతులకు రుణాలు మాఫీ కావడంలేదని సొసైటీ చైర్మన్లు చెబుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తోపాటు సంబంధిత శాఖల కమిషనర్లకు విన్నవించామని సొసైటీ పాలకవర్గం తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. రుణమాఫీ జరిగితే ఆమొత్తం పెట్టుబడికి సాయంగా ఉంటుందని పేర్కొంటున్నారు. - కటాఫ్ తేదీతో నష్టపోతున్నాం : జినుకల కృష్ణాకర్, రైతు, జంగాలపల్లి (ఇంచర్ల పీఏసీఎస్)
ప్రభుత్వం రుణమాఫీ ఇస్తోందని సంతోషపడ్డాం. రుణమాఫీ ద్వారా నేను కట్టాల్సిన రుణం మాఫీ అయితే ఆ సొమ్మును పెట్టుబడికి ఉపయోగించుకోవచ్చని సంబుర పడ్డాను. అయితే ఇంచర్ల పీఏసీఎస్ కు రుణమాఫీ వర్తించదని తెలిసే సరికి తీవ్ర ఆందోళనలో ఉన్నాము. కుటుంబమంతా కష్టపడితే తమకు దక్కే ఫలితం తక్కువ. రుణమాఫీతో అయినా ఈసారి పంటలు బాగా పండించుకునేందకు పెట్టుబడి రూపంలో పెడదామంటే తమకు వర్తించకపోవడం నిరాశే మిగిలింది.
- తమకు రుణమాఫీ వర్తింపజేయాలి : తండ నగేష్, రైతు, లక్ష్మీదేవిపేట పీఏసీఎస్
ప్రభుత్వం ద్వారా రుణమాఫీ లబ్ధి తమ పీఏసీఎస్ కు కూడా వర్తింపజేయాలి. ఎస్బీఐ బ్యాంకు అధికారులు చేసిన తప్పిదానికి తాము నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం 295మంది రైతులకు మా పీఏసీఎస్ పరిధిలో నష్టం జరుగుతోంది. ప్రభుత్వం పునరాలోచించి తమకు రుణమాఫీ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి రుణమాఫీతో నిరుపేద రైతులకు ఊరట లభిస్తుంది.