నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సర్చ్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపిఎస్
భూపాలపల్లి, అక్టోబర్ 25 (అక్షర సవాల్):
నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రత పరంగా భరోసా నింపేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపిఎస్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డలో ఎస్పి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు రాబోయే ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. యువత గంజాయి మద్యం గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు, అధిక వేగంగా మరియు మద్యం తాగి వాహనాలు నడపవద్దని, రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కాలనీలోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళలు తమపై వేధింపులు గురైతే నిర్భయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు అని పేర్కొన్నారు. వాహనాలు నడిపేవారు అన్ని ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు పోలీసులు సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు, సీఐ రామ్ నర్సింహరెడ్డి,చిట్యాల సిఐ వేణుచందర్, భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.