ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలి…భూపాలపల్లి నూతన ఎస్పీ
భూపాలపల్లి, జూలై 23(అక్షర సవాల్):
ప్రజలకు పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, బాధితులకు మెరుగైన సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన ఎస్పీ పుల్లా కరుణాకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎస్పీ సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పిగా చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఎస్ఐ మొదలుకుని జిల్లా పోలీస్ అధికారుల వరకు అందుబాటులో ఉంటారని, పోలీస్ స్టేషనులకు న్యాయం కోసం వచ్చే బాధితులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఎస్పీ సూచించారు. బాధితులకు, పేదలకు అండగా ఉండేందుకు పోలీసు వ్యవస్థ ఉందని, చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పి కరుణాకర్ అన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని, జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని, వామపక్ష తీవ్రవాదంతో పాటు, అసాంఘిక కార్యకాలపాలపై ఉక్కు పాదం మోపుతామని ఎస్పి హెచ్చరించారు. అనంతరం జిల్లా పోలీస్ పోలిసు అధికారులు సిబ్బంది, నూతన ఎస్పీని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. రాములు, కాటారం డిఎస్పి జి. రామ్మోహన్ రెడ్డి, జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.