అక్రమ వడ్డీ ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల దాడి
-12 మందిపై కేసులు నమోదు
– రూ. 3,71,240 , పలు డాక్యుమెంట్లు స్వాధీనం
భూపాలపల్లి, ఏప్రిల్ 11(అక్షర సవాల్):
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తూ, సామాన్యులను ఇబ్బంది పెడుతున్న వ్యాపారులపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో బుధవారం రాత్రి జిల్లాలోని భూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో ఏకకాలంలో పలు అక్రమ వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో 193 ప్రామిసరీ నోట్లు, 93 ఏటీఎం కార్డులు, 61 ఖాళీ చెక్కులు, 28 బ్యాంకు పాసు బుక్కులు, 109 బ్యాంకు చెక్కులు, 13 బాండ్ పేపర్లు, 11 పట్టా పాస్ బుక్కులు, రూ.3,71,240 స్వాధీనం చేసుకొని, 12 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పేద ప్రజల నుండి అధిక వడ్డీ వసూలు చేసే అక్రమ వ్యాపరుల పై కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదుతో పాటు తగిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. అక్రమ వడ్డీ ఫైనాన్స్ వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను తట్టుకోలేక కొందరు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఎస్పీ పేర్కొన్నారు. అక్రమ మార్గాల ద్వారా, అధిక వడ్డీ ద్వారా, అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ అన్నారు. బాధితులు వడ్డీ వ్యాపారుల వివరాలు పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. అలాగే ప్రజలు అనుమతులు లేని వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారస్తులను నమ్మవద్దని కోరారు. ఈ దాడుల్లో భూపాలపల్లి డిఎస్పి ఏ సంపత్ రావు, కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి, భూపాలపల్లి, కాటారం, మహదేవ్పూర్, ఇన్స్పెక్టర్లు నరేష్ కుమార్, నాగార్జున రావు, రాజేశ్వర్ రావు, సిసిఏస్ ఇన్స్పెక్టర్ రవీందర్, భూపాలపల్లి కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు.