బాలల భవిషత్తు కోసమే ఆపరేషన్ స్మైల్ : జిల్లా ఎస్పీ
భూపాలపల్లి, జనవరి 18(అక్షర సవాల్):
వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించి బాలలకు బంగారు భవిషత్తు అందించాలనే లక్ష్యంతో జిల్లా లో ఆపరేషన్ స్మైల్ -10 కార్యక్రమం నిర్వహిస్తున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.బాల కార్మికులుగా ఇండ్లల్లో, ఇతర ప్రాంతాల్లో వెట్టిచాకిరి, చేస్తున్న పిల్లలకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ స్మైల్ -10 కార్యక్రమం ఈ నెల 1 ప్రారంభించామని, చిన్నారులను పనికి పెట్టుకున్న యాజమాన్యాల నుంచి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం లేదా చదువుపై ఆసక్తి ఉన్న పిల్లలకు చదువు నేర్పించేందుకు ఇతర శాఖల అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని, అనాథ బాలలను గుర్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకోసం జనవరి 1 నుంచి 31 వరకు జిల్లాలో నెల రోజులపాటు ఆపరేషన్ స్మైల్ ను నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 23 మంది బాధిత బాలలను రక్షించామని వెల్లడించారు. కొందరు బాల కార్మికులను ప్రోత్సహిస్తూ తక్కువ కూలీకి వస్తారనీ, పనుల్లో పెట్టుకుంటున్నారని, వారి నుంచి విముక్తి కలిగించేందుకు 1098 లేదా100 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. అలాగే బాల్య వివాహాలను జరపవద్దని, చట్ట రీత్యా నేరమని అన్నారు.18 ఏండ్లలోపు పిల్లలతో పని చేయించొద్దనీ, దుకాణాలు, ఇటుక బట్టీలు, పౌల్ట్రీ ఫామ్‌లు, పశువుల కాపర్లుగా, మెకానిక్ షాపులు, పరిశ్రమల్లో పనికి పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు.