Trending Now
Trending Now

మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన

హైదరాబాద్ డెస్క్, (అక్షర సవాల్):రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు అంశాల పరిష్కారం దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మంత్రి కేటీఆర్‌, బీఆర్​ఎస్​ ఎంపీలు రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటిస్తున్నారు.

నేడు, రేపు పలువురు కేంద్రమంత్రులను కలిసి ఆయా అంశాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​తో భేటీ అయ్యారు. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాజీవ్‌ రహదారిపై స్కైవేల నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

రక్షణ శాఖ ఇచ్చిన స్థలాలకు సమానమైన భూమిని మరోచోట ఇస్తామని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రక్షణ శాఖ భూములున్న చోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందన్న ఆయన.. కంటోన్మెంట్ లీజ్‌ భూములను జీహెచ్‌ఎంసీకి బదలాయించాలని కోరుతున్నామన్నారు. కేంద్రం సంబంధిత భూములు ఇస్తే.. ప్రజోపయోగ పనులకు ఉపయోగిస్తామని తెలిపారు. 9 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని.. అయినా ఇప్పటికీ ఒప్పుకోలేదన్నారు. మెట్రో రైలు విస్తరణకూ కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చామన్న కేటీఆర్‌.. ఎంఎంటీఎస్‌ విస్తరణకు రాష్ట్ర వాటా నిధులు కూడా కేటాయించామని వివరించారు. ప్రజా రవాణా కోసమే అడుగుతున్న పనులకు కేంద్రం సహకరించాలని కోరారు. ఈ క్రమంలోనే లఖ్‌నవూ, అహ్మదాబాద్‌లో కంటోన్మెంట్‌ భూములను మెట్రో కోసం ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. మెట్రో ఫేజ్‌-1 ప్రాజెక్టులో కూడా కేంద్ర వాటా నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. కొత్తగా 31 కి.మీ. మేర మెట్రోను విస్తరించాలని భావిస్తున్నామన్న కేటీఆర్.. మెట్రో ఫేజ్‌ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. సహకరించకుంటే కేంద్రం వైఖరిని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. *అహ్మదాబాద్‌లో వరదలొస్తే భారీగా నిధులు ఇచ్చారన్న మంత్రి.. ఉద్ధృతమైన వరదలతో నష్టపోతే హైదరాబాద్‌కు ఒక్క రూపాయి సాయం చేయలేదని* మండిపడ్డారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే.. రాష్ట్రానికి 40 పైసలే తిరిగి ఇస్తున్నారన్నారు.*రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.

బీజేపీ, కాంగ్రెస్​లు విఫలం..:

ఈ సందర్భంగా దేశ సమస్యలను కాంగ్రెస్‌, బీజేపీలు పరిష్కరించలేకపోయాయని కేటీఆర్‌ విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా సమస్యలు అలాగే ఉన్నాయని మండిపడ్డారు. ఈ క్రమంలోనే నేటికీ తాగునీరు, విద్యుత్‌ లేని గ్రామాలు వేలల్లో ఉన్నాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయన్న కేటీఆర్.. ఎవరు ఎవరికి ‘బి’ టీమ్‌, ఎవరు కుమ్మక్కు అయ్యారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. *ఇప్పటి వరకు పని చేసిన ప్రధానుల్లో మోదీయే అత్యంత బలహీన ప్రధాని* అని ఘాటుగా విమర్శించారు. వృద్ధిరేటు, చమురు, గ్యాస్‌ ధరలు, ద్రవ్యోల్బణం ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ఈ క్రమంలోనే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయాలను కచ్చితంగా వ్యతిరేకిస్తామన్న కేటీఆర్.. కేంద్రంలో చక్రం తిప్పాలంటే దిల్లీలోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. తమ రాజకీయాలు హైదరాబాద్‌ కేంద్రంగానే సాగుతాయని స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles