*సాఫ్టువేర్ లోపం..అభ్యర్థులకు శాపం..
- పోలీసు నియామకాల్లో గందరగోళం
- భారీగా పోటీలో 32 ఏళ్లు దాటినోళ్లు.?
- దరఖాస్తులోనే తిరస్కరించే విధంగా సాఫ్ట్‌వేర్‌ను సెట్ చేయని పోలీస్ బోర్డు
- సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చాక వయో పరిమితి దాటారని తిరస్కరణ
- ఏడాది కష్టం వృథా అయ్యిందని వందలాది మంది అభ్యర్థుల ఆవేదన
- న్యాయ పోరాటానికి అభ్యర్థులు రెడీ
హైదరాబాద్, జులై 01(అక్షర సవాల్):
హైటెక్ పద్ధతుల్లో కానిస్టేబుల్, ఎస్సై రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నామని ఊదరగొట్టిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు కీలకమైన వయసు విషయంలో పప్పులో కాలేసిందనే విమర్శలు అభ్యర్థులనుండి వ్యక్తం అవుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ సహా దేశంలోని ఉద్యోగ నియామక కమిషన్లు, బోర్డులు అన్నీ నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్దిష్ట వయోపరిమితి దాటిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు వీల్లేకుండా రిజెక్టు చేసేలా ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌ను ‘సెట్’ చేయగా, తెలంగాణ పోలీస్ బోర్డు ఆ మౌలిక అంశాన్ని మరచిపోయింది. ఏ వయసు వారైనా దరఖాస్తు చేసుకొనేందుకు బోర్డు సాఫ్ట్‌వేర్ అనుమతించింది. దాంతో వయో పరిమితి దాటిన వాళ్లు కూడా వేల సంఖ్యలో పోలీస్, ఎస్‌ఐ దరఖాస్తు చేసుకున్నారు. వారిలో వందల సంఖ్యలో ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, తుది పరీక్ష దాటుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ వరకు వచ్చారు. అన్ని దశల్లోనూ ఏజ్ బార్ అయిన వీరిని గుడ్డిగా అనుమతించారు. చివరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు కూడా పిలిచి, మీరు అర్హులు కాదంటూ తిరస్కరించి పంపారు. వీరిలో డజన్ల సంఖ్యలో అభ్యర్థులు తమకు ఉద్యోగం పొందే స్థాయి మార్కులు వచ్చాయని, బోర్డుపై కోర్టుకు వెళతామని సవాల్ చేస్తున్నారు.
ఏడాది కాలానికి పైగా సాగుతున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో అడుగడుగునా హైటెక్ విధానాలు అవలంబిస్తున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ప్రముఖుల అభ్యంతరాలను తోసిరాజని, చివరకు అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో కూడా మానవ జోక్యం లేకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పి పోలీస్ నియామక బోర్డు హైటెక్ పరికరాలను వినియోగించింది. ఇంతాచేసి, అభ్యర్థి వయస్సు మీరితే దరఖాస్తు దశలోనే ఫిల్టర్ చేసి పక్కనబెట్టాలనే ప్రాథమిక సూత్రాన్ని మరిచింది. నియామక ప్రక్రియను కోర్టుల్లో చిక్కుకొనేట్లు చేసింది.
*రిజెక్ట్ ఆప్షన్ వాడలేదు*
తెలంగాణ పబ్లిస్ సర్వీస్ కమిషన్ సహా ఇతర పోటీ పరీక్షలకు నిర్ణీత వయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు రిజక్ట్ అవుతుంది. పోలీస్ నియామక బోర్డు వయస్సు ఎక్కువ ఉన్న అభ్యర్థుల దరఖాస్తుల్ని స్వీకరించడం ఇప్పుడు వందలమంది అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. దరఖాస్తుల పేరుతో అభ్యర్థుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసేందుకే రిజక్ట్ ఆప్షన్‌ను ఉపయోగించలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని అన్ని అంశాల్ని పూర్తిగా తెలుసుకోకపోవడం, మరికొందరు ప్రభుత్వం వయో పరిమితిపై మరింత సడలింపు ఇస్తుందేమోనన్న ఆశతో వయసు మీరినా దరఖాస్తు చేసుకున్నారు. నిర్ణీత వయస్సు కంటే కొన్ని రోజులు, నెలలు ఎక్కువగా ఉన్న వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వారిలో ఎక్కువ మంది ప్రాథమిక రాత పరీక్షలో, శరీర దారుఢ్య పరీక్షలో విఫలమయ్యారు. వందల మంది మాత్రమే తుది రాత పరీక్షలో అర్హత సాధించి మెరిట్ లిస్ట్ వరకు వచ్చారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో వయస్సు ఎక్కువగా ఉందని వారిని తిరస్కరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో ఆయా విభాగాల్లో సుమారు 17 వేల పోస్టులకు గత ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ రాగా లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పరీక్షలు, మధ్యలో దేహదారుఢ్య పరీక్ష అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల్లో సుమారు లక్ష మందికిపైగా అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ సోమవారం వరకు చేపట్టారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 32 ఏళ్లుగా నిర్ణయించారు. ఇతరులకు 27 ఏళ్లుగా పేర్కొన్నారు. నోటిఫికేషన్‌లోనూ ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారు. గత నోటిఫికేషన్లలో కొన్ని పోస్టులకు 37 సంవత్సరాల వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈ సారీ ప్రభుత్వం అలాంటి అవకాశం కల్పిస్తుందనే ఆశతో కొంత మంది వయస్సు ఎక్కువగా ఉన్నా దరఖాస్తు చేసుకున్నారు.
- బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని వదిలేశా..అభ్యర్థి ఖలీల్ పాషా
మాది వనపర్తి అన్ని పోస్టులకు సుమారు రూ. 2400 చెల్లించా. అన్ని పరీక్షలను బ్రహ్మాండంగా రాయడంతో బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని వదిలేశా. ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించడంతో అర్హత ఉన్నట్లే అని భావించా. అందరూ చెల్లుతుందనే చెప్పారు. 104 మార్కులు రావడంతో ఏదో ఒక ఉద్యోగం వస్తుందనుకున్నా.