కన్నుల పండువగా హేమచలుడి వరపూజ
మంగపేట, జనవరి 14 ( అక్షర సవాల్ న్యూస్ ) : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ది చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమచల క్షేత్రం( మల్లూరు గుట్ట ) పై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వర పూజ కార్యక్రమం మంగళవారం రాత్రి అశేష భక్త జన సందోహం నడుమ వైభవంగా నిర్వహించారు. 2025 మే 12వ తేదీన జరగబోవు స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్ణయించడానికి మంగళవారం రాత్రి మకర సంక్రమణ సమ యంలో ( రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ) ఉత్తరాయణ పుణ్యకాలమున స్వామి వారి ఆజ్ఞానుసారం వేద పండితులు అర్చకులచే వరపూజ కార్యక్రమం నిర్వహించారు. మల్లూరు గ్రామంలోని సంక్రాంతి మండపం వద్ద నిర్వహించిన ఈ వర పూజ కార్యక్రమానికి మండల ప్రజలే కాకుండా కాక ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రవణం సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ అర్చకుల ఆద్వర్యంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను హేమాచల క్షేత్రం నుండి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో మల్లూరులోని సంక్రాంతి మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారి వర పూజ కార్యక్రమం నిర్వహించారు . యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ( రాష్ట్ర మంత్రి సీతక్క కుమారుడు ) ధనసరి సూర్య స్వామి వారి వరపూజ కార్యక్రమానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి వరపూజ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏటూరునాగారం సి.ఐ. అనుముల శ్రీనివాస్ పర్యవేక్షణలో మంగపేట ఎస్.ఐ టి.వి.ఆర్.సూరి ఆధ్వర్యంలో పోలీసులు తగిన బందోబస్త్ నిర్వహించారు