ఎండల తీవ్రతకు జాగ్రత్తలు పాటించాలి
గ్రామ ప్రజలకు తహసీల్దార్ సూచనలు
గీసుగొండ, అక్షర సవాల్: గీసుగొండ మండల ప్రజలకు తహసీల్దార్ కీలక సూచనలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే నాలుగు రోజుల పాటు మండలంలో తీవ్ర ఎండలు, హీట్ వేవ్ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తరచుగా నీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం, కొబ్బరి నీరు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని తెలిపారు. ఎండల సమయంలో నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీయొచ్చని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు.

