రడం భరత్ కుమార్‌కు ఘన సన్మానం
సోమారం పాఠశాలలో భావోద్వేగ వాతావరణం
సేవాభావానికి నిలువెత్తు సత్కారం
పర్వతగిరి, అక్షర సవాల్: పర్వతగిరి మండల కేంద్రంలోని ఎంపీయుపిఎస్ సోమారం పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందించిన రడం భరత్ కుమార్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయడంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ, తక్కువ కాలం సేవ చేసినప్పటికీ భరత్ కుమార్ విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధి పట్ల చూపిన అంకితభావం విశేషమని ప్రశంసించారు. ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను స్వయంగా ఏర్పాటు చేయడం, తన సొంత ఖర్చులతో విద్యార్థులకు యూనిఫాంలు, స్కూల్ బ్యాగ్‌లు అందించడం ఆయన సేవాభావానికి నిదర్శనమని తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రేమ, బోధన పట్ల నిబద్ధతతో ఆయన తక్కువ కాలంలోనే అందరి మనసులను గెలుచుకున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి సమాజ సేవకు అంకితం కావడం ప్రశంసనీయ నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీడ్కోలు సభలో భరత్ కుమార్ మాట్లాడుతూ తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింతగా కొనసాగుతానని ఆయన పేర్కొన్నారు.


