[pj-news-ticker]
Wednesday, April 22, 2026

Buy now

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి “ప్రజా దర్బార్”

ప్రజా సమస్యలు పరిష్కరించడానికి “ప్రజా దర్బార్” 

దశలవారీగా అన్ని గ్రామాల్లో ప్రజా దర్బార్

మండలంలో అత్యధిక వినతులు

మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

పంచాయతీ నిధుల దుర్వినియోగం చేస్తే సస్పెండ్

రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క

మంగపేట, ఏప్రిల్ 21, అక్షర సవాల్: ములుగు జిల్లా మంగపేట మండలంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికే ఈ ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటుచేశామని దశలవారీగా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్కఅన్నారు. మంగళవారం మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు విశేష స్పందన లభించిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సంఘాలకు 60 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని, గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే సస్పెండ్ వేటు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ముందుగా మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి దర్శించుకున్నారు.

వినతి పత్రాల స్వీకరణ: మంగపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో మంగపేట, కమలాపూర్, బోర్ నర్సాపూర్, కోమటిపల్లి, కొత్తూరు, మోట్లగూడెం, తొండ్యాల లక్ష్మీపురం గ్రామాల ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. గ్రామాల్లోని సమస్యలు, అవసరమైన అభివృద్ధి పనులు, ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగ వివరాలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.

నిధుల విషయంలో గ్రామ సభ అనుమతి తప్పనిసరి: గ్రామ సభలను సక్రమంగా నిర్వహించి, గ్రామ ప్రజలకు అవసరమైన, అందరికీ ఉపయోగపడే అభివృద్ధి పనులకు మాత్రమే నిధులను వినియోగించాలని, గ్రామ సభ అనుమతి లేకుండా నిధులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని మంత్రి సీతక్క అధికారులను హెచ్చరించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా స్థానిక గ్రామాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే సంకల్పంతో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంతో పాటు అధికారులు గ్రామ ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు.

పరిష్కరించబోవు దరఖాస్తులు: ఇందిరమ్మ ఇళ్లు, నూతన పెన్షన్ల మంజూరు, ఉచిత విద్యుత్, పోడు భూముల పట్టాలు, పలు రెవెన్యూ సమస్యలపై అర్జీలును త్వరగా పరిష్కరిస్తామని ప్రజా దర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని, పెన్షన్లు, ఇందిరమ్మ గృహాలు, ఇతర సంక్షేమ పథకాలకు వచ్చిన దరఖాస్తులపై ఫీల్డ్ విజిట్ చేసి అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, జూన్ 2వ తేదీ నుంచి నూతన పెన్షన్లను మంజూరు చేస్తామని, రెవెన్యూ-అటవీ అధికారుల సమన్వయంతో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

తాగునీటి సమస్యలకు ముందస్తు ప్రణాళికలు: వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తాగునీటి సరఫరా సాధ్యంకాని గుత్తి కోయ ఆవాసాల్లో ప్రత్యేక వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీరు అందించాలని పేర్కొన్నారు.

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు: ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని, మహిళా సంఘాల సభ్యులకు 60 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం చేకూరుతోందని, మహాలక్ష్మి పథకం ద్వారా కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష మందికి పెన్షన్లు మంజూరు చేశామని, జూన్ 2వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి, కార్యదర్శుల ద్వారా పరిశీలించి అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీ నిధులను తాగునీరు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, డ్రైనేజీ పనులు, మోటార్ల రిపేర్లు వంటి గ్రామ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ప్రతి రూపాయిని గ్రామ సభల ద్వారా పరిశీలించి, ఖర్చు చేసిన పనులకే బిల్లులు తీయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. నిధుల దుర్వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, సస్పెండ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేఖ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, డైరెక్టర్లు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles