భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
–ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తతో విధులు నిర్వర్తించాలని సూచన
-స్టేషన్ లోని పలు రికార్డులు తనిఖీ
భూపాలపల్లి, నవంబర్ 13 (అక్షర సవాల్):
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సాధ్యమైనంతవరకు స్టేషన్ స్థాయిలోనే న్యాయం జరిగేలా పనిచేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి డిఎస్పీ ఏ. రాములు, ఎస్సై స్వప్న కుమారిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన ఫైళ్లను, పలు రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారుల సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు న్యాయం చేసేలా కృషి చేయాలని సూచించారు. పోలీసు సిబ్బందికి తమ పరిధిలోని ప్రతి గ్రామం గురించి అవగాహాన కల్గివుండాలని, ప్రజలతో మమేకమై, మరింత చేరువ కావాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలిసు అధికారులకు సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిసరాలను, శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క విధి విధానాల గురించి సూచించే 5 ఎస్ విధానం ను పిఏస్ లో అమలు చేయాలని సూచించారు. అలాగే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎలక్షన్లకు సంబంధించి తగు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళిని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ రాములు,ఎస్సై స్వప్నకుమారి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.