కార్యాలయం వద్ద హైటెన్షన్.. మహిళలని చూడకుండా ఏసీపీ దుర్భాష!
హైదరాబాద్ ,జూలై 6(అక్షర సవాల్) :
గురుకుల పాఠశాలలో పీఈటీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని గురుకుల అభ్యర్థులు గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. గాంధీ భవన్ నుంచి ఒక్కసారిగా టీఎస్పీఎస్సీ కార్యాలయం వైపు పరుగులు తీస్తూ.. టీఎస్పీఎస్సీ ముందు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కార్యాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా ఎంట్రీ గేటు ముందే పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు, అభ్యర్థుల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. నిరసన తెలుపుతున్న క్రమంలో మమహిళలని చూడకుండా అబిడ్స్ ఏసీపీ పూర్ణచందర్ రావు దుర్భాషలాడారని, పలువురు మహిళా అభ్యర్థులు ఆరోపించారు. ముట్టడికి ముందు వారు గాంధీభవన్‌లో పీఈటీ పోస్టుల భర్తీ వ్యవహారలో తమకు న్యాయం జరిగేలా చూడాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు.
పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి గురుకుల పాఠశాలలో పీఈటీ పోస్టులను భర్తీ చేయడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వేసి 1:2 పద్ధతిన నియామకాలు చేపడుతామని చెప్పి కోర్టు తీర్పు సాకుతో పెండింగ్ పెట్టారని తీవ్రంగా విమర్శించారు. కోర్టు తీర్పు వెలువడినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడం విచారకరమని తక్షణమే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి స్పందించి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జీవితాలు అగమ్య గోచరంగా మారాయన్నారు.