గీతకార్మికులు బీసీలు కాదా ?
– మాటూరి రవీందర్ గౌడ్
భూపాలపల్లి, జూన్ 30 (అక్షర సవాల్ ):
తమ తాత ముత్తాతల కాలం నుంచి కులవృత్తిని నమ్ముకొని తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఆకాశమంత చెట్టును ఎక్కి కల్లు తీస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటున్న గీత కార్మికులు ఈ మధ్యకాలంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన బీసీలకు లక్ష రూపాయల లోను పథకానికి అర్హులు కాదా..అని తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు మాటూరి రవీందర్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో18 శాతం ఉన్న గౌడ కులస్తులు తెలంగాణ ఉద్యమంలో మోకు ముస్తాదులు ధరించి ఉద్యమం చేసిన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోవడం చాలా బాధాకరమని అన్నారు. నిత్యం తాడిచెట్లు ఎక్కి ప్రమాదాల బారిన పడుతూ ఎంతోమంది గీత కార్మికులు గాయాల పాలవుతూ, మృత్యువాత పడుతున్నారని, టెక్నాలజీ పెరుగుతున్నా గానీ, గీత కార్మికులు తాడిచెట్లు ఎక్కేందుకు యంత్రాలు గాని, సేఫ్టీ మోకులు గాని తయారు చేసి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి లక్ష రూపాయల పథకాన్ని గీత కార్మికులకు కూడా వర్తింపజేయాలని, గౌడన్నల శ్రేయస్సు కోసం గౌడ బంధు ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలు అందించి,ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలని మాటూరి రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు