మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు : ఎస్పి
భూపాలపల్లి, ఏప్రిల్ 8(అక్షర సవాల్):
జిల్లాలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని, అదే సమయంలో సమాంతరంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాల గురించి తెలియజేసే గోడ పత్రికను పోలిసు అధికారులతో కలిసి ఎస్పి అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలిసుశాఖ పటిష్ఠ చర్యలు చేపడుతుందని అన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. నేటి యువత భావిభారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్‌కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. దీనిని గుర్తించి డ్రగ్స్‌వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌తో పాటు, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలన్నారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయన్నారు. భావితరాలు మాదకద్రవ్యాలపై ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని ఎస్పి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించాలని, జిల్లాలోకి మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా కాకుండా చెక్‌పోస్టుల వద్ద పకడ్బందీ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని పోలిసు అధికారులను ఎస్పి ఆదేశించారు. భవిష్యత్తులో అతిపెద్ద సవాలుగా మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు ఉంటాయని, వీటిని నియంత్రించేందుకు ప్రజలు సహకారం అందించాలని ఎస్పి కిరణ్ ఖరే పేర్కొన్నారు. నేటి యువతపై తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, తప్పుడు దారులలో వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి జి రామ్మోహన్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్, జిల్లా పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.