Devendra Fadnavis: ఫడణవీస్‌కు కాలివేలితో తిలకం దిద్దిన యువతి.. ఉద్వేగానికి గురైన డిప్యూటీ సీఎం..
(అక్షర సవాల్ డెస్క్ ): జూన్ 28:
ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Maharashtra Deputy Chief Minister Devendra Fadnavis) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలోని జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు.
ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి.
”ఇప్పటి వరకు ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నారు. తిలకం స్వీకరించాను. ఇప్పుడు కూడా నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనివేలు నా నుదిటి మీదకు చేరింది. అయితే, అది చేతి వేలు కాదు.. కాలి బొటనవేలు. జీవితంలో ఎదురయ్యే ఇలాంటి క్షణాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురిచేస్తాయి. కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఈ సోదరి నాకు తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది. ‘నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే.. నాకు ఎవరి జాలి, దయ అవసరం లేదు. ఆ పరిస్థితులను దాటుకొని వెళ్తాను’ అని ఆ మెరుపును చూస్తే నాకనిపించింది” అని ఫడణవీస్ ట్వీట్ చేశారు. అలాగే ప్రతిపోరాటంలో ఆమెకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు..