- ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. రూ. కోటితో మహిళ జంప్
- ఖమ్మం జిల్లాలో వెలుగులోకి..
వైరా జూన్ 24(అక్షర సవాల్): గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అక్రమంగా వసూలు చేసిన సుమారు రూ.1 కోటితో ఓ కిలాడీ లేడీ ఉడాయించిన ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
రెబ్బవరంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న బాజి జ్యోతి అనే కిలాడి మహిళ నమ్మిన వారిని నట్టేటముంచింది.గురుకుల పాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద రూ. 1.50 లక్షలు చొప్పున సుమారు 70 మంది వద్ద కోటి రూపాయలకు పైగా అక్రమంగా వసూలు చేసింది. నగదు చెల్లించి ఆరు నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు ఆమెపై ఒత్తిడి పెంచడంతో సుమారు నెలన్నర క్రితం పరారైంది.అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె ఆచూకీ కనీసం లభించలేదు.
జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, హైదరాబాద్ లో తనకు సంబంధం ఉన్న ఉన్నతాధికారుల ద్వారా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆమె నమ్మ పలికింది. ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షలు చెల్లించాలని ఆ కిలాడీ లేడి బాధితులకు స్పష్టం చేసింది.ముందుగా రూ.1.50 లక్షల నగదు అడ్వాన్స్ చెల్లించాలని, 15 రోజుల్లో ఉద్యోగం వస్తుందని.. ఆ తర్వాత మిగిలిన రూ. 1.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని ఆమె పేర్కొంది. నాపై నమ్మకం లేకుంటే ముందుగా మీరిచ్చే నగదుకు ప్రామిసరి నోటు రాసిస్తానని హామీ ఇచ్చింది. ఆ మేరకు నగదు చెల్లించిన ప్రతి ఒక్కరికి లక్షన్నర రూపాయలతో ఆమె ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. దీంతో నమ్మిన అమాయక ప్రజలు తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడి సుమారు జిల్లాలో 70 మంది ఆమెకు రూ.1.50 లక్షలు లెక్క చెల్లించినట్లు తెలిసింది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు నెలకు రూ. 25000 జీతం వస్తుందని, ఆ తర్వాత ఉద్యోగం పర్మినెంట్ అయి రూ.40 వేల జీతం వస్తుందని ఆమె బాధితులకు ఆశ చూపింది.ప్రామిసరీ నోటు రాసి ఇవ్వటంతో పాటు ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని నమ్మ పలకడంతో నిరుపేదలు వడ్డీకి అప్పుచేసి, బంగారు నగలు తాకట్టు పెట్టి ఆమెకు నగదును చెల్లించారు. ఆమె గత మే నెల 9వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కిలాడి మహిళ కోసం పోలీసులు అన్వేషణలో ఉన్నారు.