స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు అమిత్ కుమార్, అభయ్ నందన్ అభస్తా, కౌశిక్ రాయ్
భూపాలపల్లి, నవంబర్ 11 (అక్షర సవాల్):
ఈ నెల 30వ తేదిన జరుగబోయే శాసన సభ ఎన్నికలకు సంబంధించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని శనివారం పోలీసు, సాధారణ, వ్యయ పరిశీలకులు అమిత్ కుమార్, అభయ్ నందన్ అభస్తా, కౌశిక్ రాయ్ లు భూపాలపల్లి ఎస్పి కిరణ్ ఖరే, కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలసి పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను, అనువైన వసతి ఏర్పాటును , కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన గదులను పరిశీలించారు. పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ కిరణ్ ఖరే వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. కౌంటింగ్ మరియు స్ట్రాంగ్ రూమ్ గదులను పరిశీలించి, ఆయా గదుల్లో చేపడుతున్న అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి అవసరమైన చోట సీసీ కెమెరాలు, లైటింగ్, ఫాన్స్ , బ్యారీకేడ్లు, పార్కింగ్ వసతులు , ఇతర సౌకర్యాల గురించి ఎస్పీ, కలెక్టర్ పరిశీలకులకు వివరించారు . కౌంటింగ్ కేంద్రాలలో, స్ట్రాంగ్ రూంల దగ్గర ఏలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టి పనులు పూర్తి చేయించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆర్డిఓ రమాదేవి పాల్గొన్నారు.