జానపద గిరిజన పరిశోధనలను వెలుగులోకి తీసుకురావాలి
తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ
అక్షర సవాల్, హన్మకొండ: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో గత మూడు దశాబ్దాలుగా సేకరించిన పరిశోధనలను పుస్తక రూపంలో ముద్రించి వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. నూతనంగా అకాడమీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆచార్య కూరపాటి వెంకటనారాయణ ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని ఆయన నివాసంలో జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డా.గడ్డం వెంకన్న ఆధ్వర్యంలో పీఠం అధ్యాపకులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెంకట నారాయణ మాట్లాడుతూ ఇంటర్,డిగ్రీ, ఇతర పోటీ పరీక్షల కోసం విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నాణ్యమైన పుస్తకాలను తెలంగాణ తెలుగు అకాడమీ ముద్రిస్తుందన్నారు. ఈ క్రమంలోనే వివిధ పోటీ పరీక్షలకు అవసరమయ్యే విలువైన సమాచారాన్ని జానపద, గిరిజన బహుముకాంశాల పేరిట సేకరించి పీఠంలో భద్రపరచడం గొప్ప విషయంగా అభివర్ణించారు. ఈ పరిశోధన సమాచారాన్ని పుస్తక రూపంలో ముద్రించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. .వరంగల్ లోని జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందిస్తామన్నారు.అధ్యాపకులకు సులువుగా బోధించే విధంగా కరదీపికలను ముద్దిస్తామన్నారు. విద్యార్థుల సంక్షేమం తో పాటు జాతీయస్థాయి పోటి పరీక్షల్లో సత్తా చాటేందుకు మంచి పుస్తకాలను ప్రచురిస్తామన్నారు.విద్య, విజ్ఞానం, వైద్య రంగాల్లో సాంకేతిక అంశాలతో విభిన్న పుస్తకాలను మంచి రచయితలతో రూపొందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ దురవిద్య కేంద్రం ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొట్టే భాస్కర్ , పీఠం అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

