ఐటిడిఏ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం
ఏటూరునాగారం, జూన్ 12, అక్షర సవాల్:
ఉపాధి లేక సతమతమవుతున్న గిరిజన నిరుద్యోగ యువతీ యువకుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఐటిడిఏ ఏటూరునాగారం ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గిరిజన ప్రాంతాల్లో నైపుణ్య అభివృద్ధిని పెంచి, యువతను స్వయం ఉపాధి, ఉద్యోగ మార్గాల వైపు నడిపించే లక్ష్యంతో ఉచిత శిక్షణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఐటిడిఏ ఏటూరునాగారం ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఏటూరునాగారం, ములుగు, కాటారం, వరంగల్, మహబూబాబాద్ కేంద్రాల్లో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల యువతకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
ఎవరికి ఉపయోగం, ఎలాంటి శిక్షణ:
గ్రామాల్లో చదువు పూర్తయినా ఉద్యోగం దొరక నిరుద్యోగంగా ఉన్న గిరిజన యువత ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవచ్చు. కంప్యూటర్ బేసిక్స్, డేటా ఎంట్రీ, టైలరింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, హోటల్ మేనేజ్మెంట్, వ్యవసాయ అనుబంధ రంగాలు వంటి మార్కెట్ డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటిడిఏ వర్గాలు వెల్లడించాయి. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ తో పాటు ఉపాధి అవకాశాల కోసం అవసరమైన మార్గదర్శనం కూడా అందించనున్నారు.
సర్పంచ్ లు,పెసా మొబిలైజర్ల కీలక పాత్ర:
ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, PESA మొబిలైజర్ల సహకారం తప్పనిసరి అని ITDA అధికారులు స్పష్టం చేస్తున్నారు. నూతన, మాజీ సర్పంచ్ లు తమ గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఈ అవకాశం గురించి అవగాహన కల్పించాలి. అర్హులైన అభ్యర్థులను గుర్తించి శిక్షణ కేంద్రాలకు పంపించేందుకు సహకరించాలి. PESA మొబిలైజర్లు ఇంటింటి సర్వే చేసి, అర్హులైన యువతను నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నారు.
యువతకు పిలుపు:
ఉచితంగా నైపుణ్యం నేర్చుకుని జీవితంలో స్థిరపడేందుకు ఇది మంచి అవకాశం అని ITDA ఏటూరునాగారం PESA జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొమురం ప్రభాకర్ తెలిపారు. “ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత భోజన, శిక్షణ సదుపాయాలను నిరుద్యోగ గిరిజన యువత వినియోగించుకోవాలి. సర్పంచ్ లు, మొబిలైజర్లు చొరవ చూపి ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి” అని ఆయన కోరారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ గ్రామ సర్పంచ్ ను లేదా PESA మొబిలైజర్ ను సంప్రదించి, లేదా నేరుగా ITDA ఏటూరునాగారం కార్యాలయాన్ని, ఫోన్ నెంబర్ 9440791934 ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించి, యువతకు ఉపాధి మార్గాలు చూపించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ITDA అధికారులు పిలుపునిస్తున్నారు.


