కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం
హైదరాబాద్, జులై 24(అక్షర సవాల్ )
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనుంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా బయలుదేరనున్నారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. కాళేశ్వరం చేరుకుని మొదటగా LMD రిజర్వాయర్ సందర్శిస్తారు. అనంతరం గురువారం రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ బృందం బస చేయనుంది. ఎల్లుండి 10గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్, 11గంటలకు మేడిగడ్డ బ్యారేజీ సందర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోతోందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును బీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సోమవారం రోజున సందర్శించారు. పదిలక్షల క్యూసెక్కుల నీళ్లు తట్టుకుని మేడిగడ్డ నిలబడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలోనూ బృందం పర్యటనకు వెళ్లనుండడంతో రాజకీయంగా ఆసక్తి వాతావరణం నెలకొంది.