అక్రిడిటేషన్ల జారీలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
— టీఎస్. జే.యూ
— అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
భూపాలపల్లి , ఆగస్ట్ 6 అక్షర సవాల్: అన్ని పత్రికలతో సమానంగా చిన్న పత్రికలకు సైతం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు నివ్వడాన్ని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్. జే.యూ ) స్వాగతించింది. ఈ మేరకు మంగళవారం నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) ఎన్ యుజె(ఐ ) అనుబంధ టీఎస్ జెయు రాష్ట్ర నాయకులు పావుశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, ప్రధాన కార్యదర్శి జల్దీ రమేష్ లు మాట్లాడుతూ టీఎస్ జెయు, టిజెఎ, టిజెజెఎసిల ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అక్రిడిటేషన్ల జారీ కోసం ప్రభుత్వం జారీ చేసిన 239 ఉత్తర్వులలో లోపాలను ఎత్తిచూపుతూ జీవోను రద్దు చేయాలని కోరుతున్న విషయం విధితమేఅన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా చిన్న పత్రికలలో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ (ప్రభుత్వ గుర్తింపు కార్డులు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2016 లోని షెడ్యూల్ ఈ ను హైకోర్టు కొట్టి వేయటం అభినందనీయమన్నారు. చిన్న పత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. చిన్న పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులను ఏ,బి,సి,డి కేటగిరీలుగా విభజించడం సరైనది కాదని కోర్టు అభిప్రాయపడినట్లు వారు తెలిపారు. ఈ మేరకు హైకోర్టు ధర్మసనానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.