మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

మంగపేట, ఏప్రిల్ 10 ( అక్షర సవాల్ న్యూస్ ) : ములుగు జిల్లా మంగపేట మండలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి యువజన సంఘం పేరుతో గురువారం సాయంత్రం వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంగపేట, కమలాపురం గ్రామాలలో పలు ముఖ్య కూడళ్ళలో పలు చోట్ల రోడ్లపై వెలసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుకు నిరసనగా, మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తూ కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే గురువారం మంగపేట మండలంలో వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ఆదివాసి యువజన సంఘం ప్రశ్నిస్తున్నట్లుగా పోస్టర్లలో ఉంది . అడవుల్లో మందుపాతరలు ఆదివాసులను అడ్డుకుంటున్న మావోయిస్టులు, నిత్యం ఆదివాసి ప్రజలపై ఆధారపడి బ్రతికే మీరు అడవులే ఆధారంగా జీవనోపాధి పొందుతున్న ఆదివాసి ప్రజలను అడవుల్లోకి రావొద్దని చెప్పే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అంటూ ఆ పోస్టర్లలో ఉంది. భారత రాజ్యాంగ కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది, అడవుల్లో విచ్చల విడిగా మందు పాతరలు పెడితే ఆదివాసులు బ్రతికేదెలా మమ్మల్ని బతకనివ్వరా ? మా ప్రాంతాలపై మీ పెత్తనమేమిటి అంటూ మావోయిస్టులను ప్రశ్నిస్తున్నట్లుగా పోస్టర్లలో ఉంది. మేము అడవులలోకి వెళ్ళకుండా ఇంకెక్కడికి వెళ్ళాలి, మీరు తలదాచుకోవడానికి మా ప్రాంతాలే దొరికాయా? మీరు అమర్చిన మందు పాత్రల వలన ఇప్పటికే చాలా మంది అమాయక ఆదివాసులు చనిపోయారు, అంగ వైకల్యానికి గురయ్యారు, మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి, పోలీస్ ఇన్ ఫార్మర్ల నెపంతో దారుణ హత్యలు చేస్తున్నారు,ఎన్నో కుటుంబాలు అనాధలై రోడ్డున పడ్డాయి,మేము ఎవరి మీద ఆధారపడకుండా మా బతుకులు మేము బతుకుతున్నాం, పోలీస్ ఇన్ ఫార్మర్లగా మారాల్సిన అవసరం మాకు అస్సలు లేదు ,కేవలం మీ ప్రాణాలకు మమ్మల్నిబలి పశువులుగా చేస్తూ కనీసం అభివృద్ధికి కూడా నోచుకోకుండా అను క్షణం అడ్డు పడుతూనే ఉన్నారు ఇదేనా మీ సిద్దాంతం, ఇదేనా మీ ఉద్యమం ,ప్రజలారా తరతరాలుగా ఆదివాసులకు మావోయిస్టుల వలన జరుగుతున్న నష్టాలను ముక్త కంఠంతొ ప్రశ్నిద్దాం అంటూ ఆ పోస్టర్లలో ఉంది . ఆదివాసి యువజన సంఘం అనే పేరుతో ఈ పోస్టర్లను ఎవరు అతికించారు అనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా మండలంలో పలు చోట్ల రోడ్లపై ఈ పోస్టర్లు వెలవడం కలకలం లేపడమే కాకుండా చర్చనీయాంశమైంది.