పంచాయతీ నిధుల వ్యవహారం వివాదం
మడిపల్లి సెక్రటరీ రజియాపై లోకాయుక్త,జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు
నెక్కొండ, అక్షర సవాల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామ పంచాయతీలో 1,75,703 రూపాయల నిధుల వినియోగంపై వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంపై గ్రామ సర్పంచ్ ఆంగోత్ అనూష పంచాయతీ కార్యదర్శి రజియాపై లోకాయుక్తతో పాటు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఫిర్యాదును స్వీకరించి డైరీ నంబర్ కేటాయించినట్లు ఆమె తెలిపారు. సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ పంచాయతీకి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను పాలక మండలి సభ్యులకు సమాచారం ఇవ్వకుండా డ్రా చేసినట్లు ఆరోపించారు. ప్రమాణ స్వీకారం సమయంలో అధికారిక ప్రక్రియలో భాగమని చెప్పి దాదాపు 11 పేజీల నోట్ ఫైల్‌పై తన సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా కార్యదర్శి వద్ద ఖాళీ నోట్ ఫైల్ కాపీలు ఉన్నాయని ఆరోపించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించిన సమయంలో కార్యదర్శి రెండు రోజుల సెలవు తీసుకుని,ఇతరుల ద్వారా ఫోన్ కాల్స్ చేయిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.తప్పు చేయకపోతే ముఖాముఖి చర్చలకు హాజరై నిజాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటీవల నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మధ్యవర్తిత్వంతో సభ్యులను ప్రభావితం చేస్తూ ఆరోపణలను అసత్యంగా చూపించే ప్రయత్నాలు జరిగాయని కూడా ఆమె ఆరోపించారు. గ్రామ సభ నిర్వహించకపోయినా నిర్వహించినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.గతంలో చేపట్టిన పనులకు సంబంధించి పాలక మండలి తీర్మానం 27-01-2026న జరిగినప్పటికీ,నోట్ ఫైల్లో 23-12-2025 తేదీ నమోదు చేయడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే డీఎల్పీవో దృష్టికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో పారదర్శకత ఉండేలా అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలను వెలుగులోకి తేవాలని,బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ ఆంగోత్ అనూష కోరారు.


