అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS .
మహబూబాబాద్ జూలై 20 అక్షర సవాల్ : రాష్ట్ర వాతావరణ శాఖ రెండు రోజుల పాటు మహబూబాబాద్ జిల్లాకు భారీ వర్షాలు (రెడ్ అలర్ట్) సూచించిన దృష్ట్యా జిల్లా ప్రజలకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి సూచనల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం,జిల్లా పోలీసు అధికారులు ఎల్లవేళలా అప్రమత్తతతో విధులను నిర్వర్తిస్తుంది. ఈమెరకు జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీసు అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు అత్యవసర సమయాలలో తప్ప బయటకి రాకూడదని సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్న అత్యవసర సమయంలో డయల్ 100 కు లేదా జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు అత్యవసర సమయంలో స్పందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రజలు 8712656928 నంబర్కు సంప్రదించగలరని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని సూచించారు. జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని పోలీస్ స్టేషన్ల నందు అప్రమత్తతతో ఉంటుందని తెలిపారు. భారీ వర్షాలు పడి వాగులు వంకలు పొంగి ప్రవహించే గమనిస్తూ ఉండాలని, వాగులనుండి నీరు రోడ్డు పైకి ప్రవహించే సమయాలలో ప్రజలు వాటిని దాటకుండా ఉండాలని సూచించారు. చెరువులు, వాగుల వద్ద మత్స్యకారులు, ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. వర్షం భారీగా ఉన్నప్పుడు పొలాలలో రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకుండా ఉండాలని సూచించారు. చెట్ల కింద, పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల పక్కన ఉండకుండా చూడాలి. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు పాత భవనాలలో ఉండకుండా చూడాలని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకలు దగ్గర నీటి ప్రవాహం స్థితిగతులపై ముందస్తు సమాచారం తెలుసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పోలీస్ అధికారులు పర్యవేక్షించాలని తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల రాకపోకలను గమనించాలని సూచించారు. వాహనదారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నీటి ప్రవాహం, వర్షం వల్ల ఏర్పడిన గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉందని ఉన్నందున సిబ్బంది అలాంటి ప్రదేశాలలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.