ఎంజీఎం హైస్కూల్లో గోకులాష్టమి వేడుకలు
గణపురం, ఆగస్టు 24(అక్షర సవాల్):
చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్లో హిందూ ఇతిహాసాలలో శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుని జన్మదినం శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులను కన్నయ్య రూపంలో, గోపికల వేషధారణతో చిన్నతనంలో కృష్ణుడు అల్లరి పిడుగుగా, వెన్నదొంగగా, ఉట్టికొట్టే విధానం, చిలిపి చేష్టలతో జీవిత పరమార్ధాన్ని తెలిపిన తీరును ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లల వేషధారణ చూసి మురిసిపోతూ పాఠశాల యాజమాన్యం కృష్ణాష్టమి విశిష్టతను విద్యార్థులకు, సమాజానికి తెలియజేసే విధంగా చేసిన చొరవకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ ఈ పండుగ భిన్నత్వంలో ఏకత్వం నింపే సామాజిక ఉత్సవం అని, గోపబాలకుడిగా, సోదరునిగా, అసురసంహారిగా, ధర్మసంరక్షకుడిగా, ఎన్ని పాత్రలు పోషించిన అంతా లోక కళ్యాణం కోసమే అని తెలియజేస్తూ,మన దేశ సంస్కృతి, సాంప్రదాయ, ఆచార వ్యవహారాలు, పండుగ రీతుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం, విద్యతోపాటు, సర్వతోముఖాభివృద్ధి పెంపొందించడమే ప్రధాన ధ్యేయంగా పాఠశాల నడపబడుతుందని అందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు,విద్యాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్, ప్రిన్సిపల్ మధుకర్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.