తెలంగాణ ప్రజలకు హోళి శుభాకాంక్షలు
ఎంపీ రవిచంద్ర సందేశం
హైదరాబాద్, అక్షర సవాల్: రంగుల పండుగ హోలీ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన తన సందేశంలో హోలీ పండుగ వసంత ఋతువులో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే శుభదినమని పేర్కొన్నారు. అనాది కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయం సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. కాముని దహనం అనంతరం చిన్నా పెద్ద, కుల మత భేదాలకు అతీతంగా అందరూ కలిసి గెంతులేస్తూ పండుగను జరుపుకోవడం భారతీయ సంస్కృతిలో ప్రత్యేకత అని వివరించారు. మహిళలు ఇంటి ముందర రంగురంగుల ముగ్గులతో పండుగ శోభను మరింత పెంచుతారని తెలిపారు. రసాయనాలతో కూడిన రంగులను ఉపయోగించకుండా సహజసిద్ధమైన రంగులనే వాడాలని సూచించారు. ఈత రాని వారు చెరువులు, కుంటలు, స్విమ్మింగ్ పూల్స్‌కు దూరంగా ఉండాలని, గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని యువతకు హితవు పలికారు. ఈ రంగుల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ ఎంపీ రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. రంగులు చల్లుతూ… ప్రేమ పంచుతూ… హోలీని సురక్షితంగా, ఆనందంగా జరుపుకుందాం!


