బాధితులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయండి: ఎస్పీ
భూపాలపల్లి, జనవరి 8(అక్షర సవాల్):
శాంతి భద్రతలకు సంబంధించి బాధితులు నిర్భయంగా తమ సమస్యలను పోలీసులకు పిర్యాదు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన 11 మంది బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయా సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పరిశీలించి, పరిష్కరిస్తుందని, బాధితులకు అండగా ఉంటూ పిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలిసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పి పోలిసు అధికారులను ఆదేశించారు.