గుడుంబా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు : ఎస్పి
భూపాలపల్లి, ఆగస్టు 2(అక్షర సవాల్):
జిల్లాలో గుడుంబా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో గుడుంబా స్థావరాలపై ఎస్పి ఆదేశాలతో ఏక కాలంలో పోలిసు, ఎక్సైజ్ అధికారులు సిబ్బందితో కలిసి సంయుక్త దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలో 1620 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, ఏడుగురిపై కేసు నమోదు చేయగా, కాటారం సబ్ డివిజన్ పరిధిలో 1200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం తో పాటు, 33 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, సంబధిత వ్యక్తులపై 10 కేసులు నమోదు చేసినట్లు ఎస్పి తెలిపారు. ప్రభుత్వ నిషేధిత పదార్థాలు క్రయవిక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పి హెచ్చరించారు. పల్లెలను పట్టిపీడిస్తున్న గుడుంబాను అరికట్టడానికి ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. అలాగే గుడుంబా సంబంధిత సమాచారాన్ని తమ పరిధిలోని స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పి పేర్కొన్నారు.