మార్మోగిన ‘గోవిందా’ నినాదాలు
గీసుకొండ, అక్షర సవాల్:
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరలో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తి వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథాన్ని కొమ్మాల గుట్ట చుట్టూ ప్రదక్షిణగా ఊరేగించారు. రథం కదులుతుండగా భక్తులు “గోవిందా… గోవిందా…” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా రథాన్ని లాగారు. గుట్ట పరిసరాలు భక్తి నినాదాలతో మార్మోగాయి. గుట్ట చుట్టూ రథం తిరిగే ఈ సంప్రదాయం జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు పరిసర గ్రామాలు, జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవస్థాన కమిటీ కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసింది.




