బీర్ సీసాతో దాడి… కేసు నమోదు
గీసుగొండ, అక్షర సవాల్:
వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులపై బీర్ సీసాతో దాడి చేసిన ఘటనలో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం… దుగ్గొండి మండలం దేశాయుపల్లి గ్రామానికి చెందిన తోగరు పవన్ (తండ్రి రమేష్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదైంది. మార్చి 8వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో కొమ్మాల గుడి వద్ద పిర్యాదుదారు తోగరు పవన్ తన వరుస సోదరుడు తోగరు సాయి, అతని స్నేహితుడు మామునూరు జయంత్‌తో కలిసి దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. ఆ సమయంలో మామునూరు జయంత్ తన గ్రామానికి చెందిన స్నేహితులతో మాట్లాడుతుండగా, లక్ష్మీపురం గ్రామానికి చెందిన మామునూరి దీక్షిత్ కుమార్ (తండ్రి రవి) అకారణంగా అక్కడికి వచ్చి బీర్ సీసా పగులగొట్టి తోగరు సాయిపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో తోగరు సాయికి పెదవికి గాయమై రక్తస్రావం జరిగింది. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పిర్యాదుదారు తోగరు పవన్‌పై కూడా నిందితుడు దాడి చేయడంతో అతని ఎడమ భుజంపై తీవ్రమైన గాయం ఏర్పడింది. అనంతరం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడు మామునూరి దీక్షిత్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు.

